30, డిసెంబర్ 2010, గురువారం

మీ బ్లాగుని PDF గా చెయ్యాలనుకుంటే RSS ఎనేబుల్ చెయ్యండి

బ్లాగుని ఒక PDFగా చేస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచన చాలా మందికి వచ్చి ఉంటుంది. ఒక వేళ రాకపోతే ఇప్పుడు తెచ్చుకోండి. ఎందుకంటారా, ఉదాహరణకి, మీరు వ్రాసిన బ్లాగు పోస్టులన్నీ మీరు భద్రప్రఱచుకోవాలనుకున్నారనుకోండి, ఎమి చేస్తారు? ఎలా చెయ్యాలో మీకు తెలుసా? ఇలాంటి వారి ఆలోచనల నుంచి ఉద్బవించినదే ఓ అవకాశం. ఇలా చెయ్యాలనుకున్నవారి నిమిత్తం ఒక అప్లికేశన్ చేస్తే ఎలా ఉంటుందబ్బా అని ఆలోచించి, మొదలు పెట్టాను. క్రిందటి సంవత్సరమే దీనిని మొదలు పెట్టినా, పెద్దగా పురోగతి సాధించలేక పోయ్యాను. దానికి పలు ఆటంకాలు మఱియు అవరోధాలు. వీటన్నింటినీ అధిగమించి ఎలాగైతే ఓ ఉపకరణాన్ని తయ్యారు చేసాను. ఇక అంతా అయ్యింది అని సంబరపడే వేళలో మరి కొన్ని విఘాతాలు. వాటినీ అధిగమిస్తాను అన్న మనోధైర్యం నాకు ఉంది అలాగే అధిగమించడానికి కావలసిన సాంకేతిక జ్ఞానమూ ఉంది. కాకపోతే నా చేతిలో లేని ఓ విషయమే ఇక్కడ ఇప్పుడు ప్రస్తావిస్తున్నది.

ఈ ఉపకరణం సృష్టించే ప్రయత్నంలో చాలా విషయాలు నేర్చుకుంటున్నాను. వాటిలో చాలా మటుకు సాంకేతిక పరమైనవి అయితే, ఒకటి బ్లాగు పరమైనటువంటిది. అది నలుగురితో పంచుకుంటే, అందరికీ తెలుస్తుందని ఇలా నా బ్లాగులో పెడుతున్నాను. తెలిసిన వారు ఒగ్గేయ్యండి, తెలియని వారు ప్రయత్నించండి. ఎందుకంటే, RSS కనుక ఎనేబుల్ చేస్తే మీ బ్లాగుని చదవాలనుకునే వారికి మీరు మఱో సౌలభ్యం కలిగించిన వారౌతారు. లేదనుకోండి చదవాలని ఆసక్తి ఉన్నవారు, తప్పని సరిగా మీ బ్లాగుని సందర్శించాల్సిందే. అంతే కాకుండా, నా ఉపకరణం ద్వారా మీ బ్లాగుని PDF చేసుకోవాలనుకుంటే, RSSని ఎనేబుల్ చెయ్యండి. చేసి, నాకో లేఖ వ్రాస్తే, మీ బ్లాగుని నా ఉపకరణం చదవగలుగుతుందో లేదో చూసి చెప్పగలను. నా ఈ ఉపకరణం యొక్క మొదటి మెట్టు RSS ద్వారా మీ బ్లాగుని చదివి ఆ తరువాత PDFని తయారు చెయ్యడం. ఇది సాధించిన తరువాత RSS లేకపోయినా చదవగలిగేటట్టు తయారు చేస్తాను.

ముందుగా మీ బ్లాగులో RSS ఎనేబుల్ చెయ్యబడి ఉందో లేదో చూసుకోండి లేదా ఈ క్రింద చూపిన చిత్రంలో హైలేట్ చెయ్యబడ్డ లంకెలను వరుసక్రమంలో ప్రయత్నించండి. ఈ క్రింద ఇచ్చేవి బ్లాగర్ వారి సెట్టింగ్స్ మాత్రమే, వర్డ్ ప్రస్ వారి సెట్టింగ్స్ మరో విధంగా ఉండవచ్చు. గమనించగలరు.

image

మీ బ్లాగు సెట్టింగ్స్ మార్చేటప్పుడు ఒక్క సారి “Advanced Mode” వెళ్ళి చూడండి. అక్కడ మీకు మరి కొన్ని సౌలబ్యాలు కనబడతాయి. దాని తెరపట్టుని ఇక్కడ మీకు అందిస్తున్నాను.

image

ఇక్కడ మీరు గమనించాల్సిన విషయమేమిటంటే, ఒక్క బ్లాగు పోస్టులు మాత్రమే కాకుండా, పోస్టు స్పందనలు కూడా మీరు నియంత్రించవచ్చు. ఇలా నియంత్రించేటప్పుడు ప్రతీ పోస్టుకీ స్పందనలు విడివిడిగా ఇవ్వవచ్చు లేదా అన్ని స్పందనలను కలగలిపి ఒక ఫీడ్ మాదిరిగా ఇవ్వవచ్చు. అంతే కాకుండా, ఇవేమీకాకుండా, ఫీడ్ బర్నర్ ద్వారా మీ బ్లాగుకి ఒక లంకె ఏర్పరుచుకునే అవకాశమూ ఇక్కడ ఉంది. నా సలహా ఏమిటంటే, మీకు పైన చూపిన తెరపట్టులో అన్ని సౌలభ్యాలకు నేను “Full” అని ఉంచాను కావున నాకు ఫీడ్ బర్నర్ వారి అవసరం లేదు. మీరు కనుక మీ బ్లాగు సెట్టింగ్స్‍ పైన చెప్పినట్లు లేనట్లైతే మఱోసారి మీ బ్లాగు సెట్టింగ్స్ అన్నింటినీ ఒక్కసారి సరి చూసుకోండి లేదా నాకు ఒక విధ్యుల్లేఖ వ్రాయండి, స్పందిస్తాను.

అంతవరకూ నేను నా ఉపకరణం తయ్యారు చేసే పనిలో ఉంటాను. మీరు స్పందించే పనిలో ఉండండి.

6 కామెంట్‌లు:

సుజాత వేల్పూరి చెప్పారు...

నేను బ్లాగర్ ద్వారా కాక, PDF convertor ని ఉపయోగించి బ్లాగ్ పోస్టుల్ని పీడీ ఎఫ్ చేయడం మంచిదనుకుంటున్నా! దాన్లో అయితే ఒక్కొక్క బ్లాగ్ పోస్టుని కూడా కామెంట్స్ తో సహా విడి విడిగా పీ డీ ఎఫ్ చేయవచ్చు

Anyway, congratulations for your effort.

చైతన్య కృష్ణ పాటూరు చెప్పారు...

సరిగ్గా ఇటు వంటి పరికరాన్నే తయారు చెయ్యటానికి రెండు నెలలుగా వీకెండ్స్ తల బద్దలుకొట్టుకుంటున్నా. నేనిక రిలాక్స్ అవ్వొచ్చన్నమాట :-)

ఓ బ్రమ్మీ చెప్పారు...

సుజాత గారు,

ముందుగా స్పందించినందులకు నెనరులు. తరువాత, మీరు ప్రస్తావించిన PDF Convertor లంకె ఇవ్వగలరా, నేను కూడ ఒక సారి చూసి నా ఉపకరణం అలాంటి పనే చేస్తుంటే, అందులో లేని ఉపయోగాలతో తయారు చేసే ప్రయత్నం చేస్తాను.
అలాగే నేను చేసే ఉపకరణం యొక్క కొన్ని సౌలభ్యాలలో ఒకటి, మీకు నచ్చిన ఒక లేద కొన్ని పోస్టులను పీడియఫ్ గా చేసుకోవచ్చు. ఇలా చేసుకునే పక్షంలో స్పందనలను కలుపునికూడా చేసుకోవచ్చు. ఆ విధంగా ఒక్కొక్క మరియు నచ్చిన కొన్ని లేదా అన్నీ మీరు విత్ స్పందనలు ఆర్ విత్తౌట్ స్పందనలు పీడీయఫ్ గా చేసుకోవచ్చు.

చైతన్య గారు,

మీరేమీ రిలాక్స్ అవ్వాల్సిన అవసరం లేదు. ఏమో మీరు చేసే ఉపకరణం నా ఉపకరణం కన్నా మెఱుగ్గా పని చేయ్య వచ్చేమో.. ఎవ్వరు చెప్పొచ్చారు. కావున మీ ప్రయత్నాని అలాగే కొనసాగనివ్వనీయ్యండి. అంతా శుభమే జరుగుతుంది. ఏమైనా స్పందించి మీ ఆలోచనను చెప్పినందులకు నెనరులు

విహారి(KBL) చెప్పారు...

నా బ్లాగు మీ ఉపకరణం చదవగలదా చెప్పగలరు

http://geetalu.blogspot.com/

ఓ బ్రమ్మీ చెప్పారు...

విహారి గారు,

మీరు నాకు పెద్ద చిక్కు తెచ్చి పెట్టారు. మీ బ్లాగుని నా ఉపకరణం చదవగలిగింది, కాకపోతే నా ఉపకరణానికి మీ బ్లాగు ఒక పెద్ద అవరోధం మరియు విప్పలేని చిక్కై కూర్చుంది. దీనిని నేనొక ఛాలెంజ్ గా తీసుకుంటున్నాను. దీనిని ఛాలెంజ్‍గా తీసుకోవడం వెనకాల కారణాలు
౧) మీబ్లాగులో దాదాపు పన్నెండు వందలకు పైగా పోస్టులు ఉన్నాయి.
౨) అన్నింటినీ చదవడానికి దాదాపు ౩ జీబీ మెమొరి కావాల్సి వచ్చింది. అంత మెమొరి నా వద్ద ఉన్నా, ప్రతీ కంప్యూటర్లో అంత మెమొరి ఉంటుందా అన్న అనుమానం.
౩) ఇంత పెద్ద బ్లాగుని పీడియఫ్ గా చెయ్యగలిగితే, నేను సాంకేతికంగా ఓ పెద్ద అడుగు ముందుకు వేసినట్టే.

ఇవే కాకుండా పలు ఛాలెంజెస్ కూడా ఉన్నాయి, వాటిని నేను మీకు చెప్పడం ద్వారా మీరు అర్దం చేసుకోలేరేమో అని ప్రస్తుతానికి దాటవేస్తున్నాను. కానీ మీ పీడియఫ్ చేసాను. మీకు కావాలంటే పంపగలను.

ఆఖరుగా, స్పందించి నాకు ఓ చాలా అతి పెద్ద చిక్కుని ఇచ్చినందులకు నెనరులు. ఇక్కడ నేను ఇన్ని విశేష పదాలను ఉపయోగించడం వెనకాల ఉన్న ఆంతర్యం సాంకేతికపరమైనది అని గమనించగలరు. అంతే తప్ప మీరు ఏమీ చెయ్యలేదు.

విహారి(KBL) చెప్పారు...

నెనర్లు. నాకు ఎలా పంపిస్తారు. మెయిల్ ద్వారానా? ౩ జిబి సిస్టం మెమరీ లేదా pdf సైజు ?

 
Clicky Web Analytics