7, జూన్ 2011, మంగళవారం

హోమ్ లోన్ వివరించే ఎక్సెల్ ఫైల్ తప్పిపోయింది

చాలా కాలం క్రిందట ఓ స్నేహితుడినుంచి మైల్లో ఓ ఎక్సెల్ ఫైల్ వచ్చింది. దానిలో హోమ్ లోన్ తీసుకుంటే నెల నెల మనం ఎంత కట్టాలి అనే విషయాన్ని చాలా బాగా వివరించి ఉంది. దానిని డౌన్లోడ్ చేసి ఎక్కడో దాచి ఉంచాను. తీరా ఇప్పుడు అవసరం అయ్యింది. వెతికితే దొరకడం లేదు. నా లాప్ టాప్ నుంచి అది తప్పించుకుని తిరుగుతోంది. దొరికిన వారికి (తగిన) ఆశ్చర్య కరమైన బహుమతి ప్రకటించడమైనది.

టీసీయెస్ లో పనిచేసే ఓ ఉద్యోగి కొంచం శ్రమించి ఓ ఫైల్ ని తయారు చేసినా దానియందు 2010 సంవత్సరం వరకే అవకాశం ఉంది. మనం ప్రస్తుతం 2011 లో ఉన్నాం కదా అందుకని అది వీలు పడదు అని అనుకుంటే, నాతో పాటు పనిచేసే ఓ సహ ఉద్యోగి, “దానిదేముంది బాసు.. అందులో ఏదో ఒక సంవత్సరం వేసేయ్.. నీక్కావలసిందేంటి? ఏ సంవత్సరంలో ఎంత ఇంట్రస్ట్ కట్టావు? వగైరా వగైరా విషయాలేకదా!!” అంటూ తెల్చేశాడు. అవును అదికూడా నిజమే కదా అని ఆలోచించుతూ ఉంటె, ఆ ఎక్సెల్ ఫైల్లో ముందుగా మనం ఏదైనా ఎమౌంట్ కడితే దాని నుంచి ఎంత ఇంట్రస్ట్ తగ్గుతుంది వంటి వివరాలు లేవు.

ఏది ఏమైనా, అలాంటి ఫైల్ ఎవ్వరికి దొరికినా నాకు తెలియజేయండి గిఫ్ట్ కొట్టేయ్యండి.

3, జూన్ 2011, శుక్రవారం

అభివృద్దా లేక వినాశనమా!!

యాపిల్ వారు విడుదల చేసిన రెండొవ సంతతికి చెందిన ఐపాడ్ కొనుక్కునేందుకు చైనాలోని ఓ పదిహేడేళ్ళ అబ్బాయి తన కిడ్నీని అమ్ముకున్నాడన్న విషయం నిన్న చైనా టీవీలో కనబడ్డా అదేమీ పెద్ద వింతకాదన్నుట్లు చైనీయులు పట్టించుకోలేదంటే, అక్కడ జరుగుతున్నది అభివృద్దా లేక వినాశనమా?

జనాభా పెరిగితే ఇంతకన్నా ఘోరమైన విషయాలు చదవాల్సి వస్తుందేమో అనిపిస్తోంది. సాంకేతిక పరమైన అభివృద్ది మంచిదే, కానీ పిల్లలకు స్వేచ్చనిస్తే ఏమి జరుగుతుందో ఇప్పుడు కళ్ళకు కట్టినట్లు కనబడినా అదేమీ పెద్ద వింతకాదులే అనే వారి ధోరణిని ఎలా అర్దం చేసుకోవాలో తెలియటం లేదు. ఆ విషయాన్ని స్పందిచినవాళ్ళు అదేదో పెద్ద హాస్యం అన్నట్లు నవ్వుకోవడం మరీ చోద్యంగా ఉంది.

దీనివెనుక అక్కడి తల్లి తండ్రుల పెంపకం ప్రధాన పాత్ర వహిస్తుంది అనిపిస్తోంది. మున్ముందుగా పిల్లలు జాలంలో ఎలాంటి పనులు చేస్తున్నారు అనే విషయాన్ని ఇక్కడ పెద్దలు పట్టించుకున్నట్లు లేరు. ఆపై మూడు రోజులు అబ్బాయి కనబడక పోతే పట్టించుకు పోగా ఒక చేతిలో ఓ లాప్ టాప్ మఱో చేతిలో ఐపాడ్ పట్టుకు తిరుగుతున్న అబ్బాయిని పట్టుకుని అడిగితే అప్పుడు అస్సలు విషయం చావు కబురు చల్లగా చెప్పినట్లు వివరించాడంట.

అమ్మేవాడికి తెలివి లేదనుకుందాం, పోనీ కొనే వాడిని మానవతా విలువలు ఉండనక్కర్లేదా అని అడిగితే, దానిదేముందండి అది ఎక్కడ అమ్ముతారో చెప్పండి దాన్నీ కొనుక్కొచ్చేద్దాం అని అంటారు. ఇలా నైతికపరంగా వీరు చాలా దిగజారిపోతున్నారన్నది నిజమై అని మనం అనుకునేంతలో.. అక్కడెక్కడో ఎందుకు చూస్తావు, నీ ముడ్డి క్రింద నలుపు చూసుకో అంటూ మరో ఘటన మన ఆంద్ర ప్రదేశ్ లో ఇవ్వాళ్ళ ఉదయం జరిగింది.

మరో మహిళపై ఓ ప్రేమోన్మాది దాడి చేసి హత్య చేసిన వైనం. అదే తంతుగా ఇవ్వాళ్టి లైవ్ ఛానల్స్ అన్నీ ఊదరగొట్టేశాయి. చైనాలో కుర్రాడు చక్కగా తన కిడ్నీనే అమ్ముకుంటే, మనోళ్ళు ఇంకొంచం ముందుకు వెళ్ళి ప్రక్కనోళ్ళ ప్రాణాలు తీస్తున్నారు. అక్కడ పడి ఉన్న శరీరాలను కెమెరాలలో భందించాలనే తాపత్రయం ఆ అమ్మాయిని బ్రతికిద్దాం అన్న విషయంపై పెట్టటం లేదు మన కెమెరా మెన్స్. ఒక కెమెరా మెన్ వీడియో తీస్తుంటె, మఱోకతను అక్కడ పడి ఉన్న వారిని కెమెరాలో బాగా పడ్డారా లేదా అన్ని వారిని సరి చేస్తుంటాడు. వీరిని చూస్తుంటే అసహ్యం వేస్తుంది.

ఇలాంటి సమస్యలన్నింటికీ కారణం..

మొదటిది) తల్లి తండ్రుల పెంకపంలో లోపం.

రెండొవది) స్వతహాగా ఉండాల్సిన నైతిక విలువలు. తల్లి తండ్రి నేర్పలేదనుకోండి, పెరిగి పెద్దైన వీరి బుద్ధికేమైంది.

ఇవన్నీ ఆలోచిస్తుంటే, అసహనం వస్తోంది. పిల్లలు లేకపోవడం ఓ రంకంగా సమాజానికి మేలేనేమో అనిపిస్తోంది. ఇంకా వ్రాస్తే ఏదో వస్తుంది.

1, జూన్ 2011, బుధవారం

నేనూ తీవ్రవాదినే

Maunika

వరంగల్ జిల్లాలోని రఘునాధ పల్లిలో నిన్న జరిగిన ఘటనలో ఓ యువకుడిని గ్రామస్థులు కాల్చి చంపిన వైనంలో నాకు తప్పేమీ కనబడలేదు. ఇలా ఆలోచించడం ఓ తీవ్రవాది ఆలోచిస్తున్నట్లు ఉంటే, నేనూ తీవ్రవాదినే. నిజమే, ఆ అబ్బాయి తప్పు చేసి ఉండవచ్చు, అయినంత మాత్రాన అతనికి ఇంత పెద్ద దండన వెయ్యడం అనే హక్కుని గ్రామస్థులు తమ చేతిలోకి తీసుకోవడం అనేది భరతీయ న్యాయ వ్యవస్థకు విరుద్దమే అని మీరంటే నా దగ్గర అందుకు ఎటువంటి స్పందన లేదు అలాగే వారి చర్యను సమర్దించేందుకు కావలసిన సరైన సమాధానం నా వద్ద లేదు. న్యాయ వ్యవస్థ పై మనకు ఉన్న గౌరవాన్ని తుంగలో తొక్కి న్యాయాన్ని తేల్చి శిక్షని విధించే హక్కుని తమ చేతుల్లోకి తీసుకున్నారు అంటే, దాని వెనకాల

  • గ్రామస్థుల క్షణికావేశం ఉండి ఉండవచ్చు
  • వారి కళ్ళముందు ఓ అమ్మాయి నిస్సహాయ స్థితిలో పడి ఉండటం వారిని అసహనానికి గురి చేసి ఉండవచ్చు
  • వారి ఊరిలోని ఓ అభాగ్యురాలు దాడికి గురై రక్తం ఓడుతున్న స్థితిలో మృత్యువుతో పోరుడుతున్న వైనం వారి ఆగ్రహానికి కారణం అయ్యుండవచ్చు

నిజానిజాలేమిటో నాకు తెలియదు. కానీ నాకు కనబడుతున్నదల్లా, ఓ అభాగ్యురాలు దారుణంగా, అత్యంత హేయంగా గాయపరచ బడి  అపస్మారకంగా పడి ఉంది. (ఇక్కడ ఇచ్చిన చిత్రం ఈనాడు వారి వెబ్ సైట్ నుంచి తీసుకోబడినది) అలాంటి స్థితిలోంచి ఓ యువకుడు పారిపోతున్నాడు అని ఈనాడులో వ్రాసారు. విచారించకుండా గ్రామస్థులు తొందరపడతారని నేను అనుకోను. ఒక్కరు లేదా ఇద్దరు తప్పుగా అనుకున్నారంటే ఆలోచించవచ్చు, గ్రామం మొత్తం దాదాపు ఆరు వందల మంది గుమ్మి గూడి పోలీసుల మధ్య ఉన్న ఆ యువకుడిని లాకొచ్చి మరీ కాల్చారంటే సదరు యువకుడు..

  1. తాను చెయ్యని పనికి గ్రామస్థులు పట్టుకుంటే, వారి అహాన్ని రెచ్చకొట్టే విధంగా ప్రవర్తించి తన మీదకు తెచ్చుకునే ఉంటాడు
  2. పోలీసుకు రంగప్రవేశం చేసిన తరువాత ప్రస్తుతానికి గండం గట్టేక్కిందనుకుని గ్రామస్తులతో విర్రవీగుంటాడు
  3. తాను నిర్దోషినని నిరూపించుకునే ప్రయత్నంలో కనీసం గ్రామస్థుల ఆగ్రహాన్ని గ్రహించి తనని తాను నిమ్మదించుకునే ప్రయత్నం చేసే వాడు. ఒక వేళ అలా జరిగి ఉంటే, గ్రామస్థులలో ఆగ్రహం ఇలా కట్టెలు తెంచుకునేది కాదు
  4. ఇంకా .. డాష్.. డాష్..

ఇలా చాలా విశ్లేషించ వచ్చు. ఒకవేళ నిజ్జంగా అతను నిర్దోషి అయినా, ఇలా శిక్షింపబడటం అతని దురదృష్టమే. కాని ఇలాంటి ఘటన మరో యువతిని దాడి చేయ్యాలనుకునే ప్రతీ మగవాడికి ఓ గుణపాఠం కావాలి. అమ్మాయిగా పుట్టడమే ఆడపిల్లకు శాపమా అని ఇంతకు మందు కొంతకాలం క్రిందట వ్రాసుకున్నాను. ఒక్కొక్క సారి అది నిజమేమో అనిపిస్తుంటుంది. అతివలు నిస్సహాయులు కాదు గ్రామం మొత్తం ఎకమై నిలుస్తుంది అని నిరూపించడం ఆ గ్రామం యొక్క ఏకత్వాన్ని తెలియజేస్తుంది. ఆడ పిల్ల ఒక్క ఇంటి పిల్లేకాదు గ్రామం మొత్తానికి ఆడపిల్లే అని చాటిన రఘునాద పల్లి గ్రామస్తులకు చెయ్యెత్తి నమస్కరిస్తున్నాను.

ఇలా నేను వ్రాయడం కూడా అసాంఘీకమే అయితే నేను తీవ్రవాదినే. రాజకీయ నాయకుల లెక్కన ఏది జరిగినా చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది అని సమాధాన పరచుకుంటూ బ్రతికేయ్యమంటే, ఇంతటి దుర్ఘటన సమయంలో నా వల్ల కాదేమో. ఎవ్వరైనా మనల్ని మోసం చేయ్యడం ద్వారా డబ్బు నష్టపోతే ఎదో విధంగా తిరిగి సంపాదించుకోవచ్చు. అన్యాయంగా ఎవ్వరైనా నా ఇల్లు కబ్జా చేసి నన్ను ఇంట్లోనుంచి తరిమి వేస్తే వేరే ఇంట్లో చేరుకుని న్యాయస్థానాన్ని ఆశ్రయించి పోరాడి తిరిగి ఆ ఇంటిని దక్కించుకోవచ్చు. మాన ప్రాణాలకు ముప్పు కలగనంత వరకూ ఏదో విధంగా న్యాయస్థానాన్ని ఆశ్రయించో లేక లంచాలిచ్చి పోలీసులను పట్టుకునో మన పనులు చేయించుకోవచ్చు. విజయవాడలో పరిక్ష హాలులో ప్రాణాలు తీసిన మనోహర్ ఇప్పుడు చక్కగా మూడు పూటల తిండి తింటూ రకరకాల పుస్తకాలు చదువుకుంటూ జీవితాన్ని ఆనందంగా గడిపేస్తున్నాడే!!

కాని ఇలాంటి స్థితిలో ఈ అమ్మాయికి న్యాయం ఎప్పుడు జరుగుతుంది? ఇప్పుడు ఈ ఆడ పిల్ల పళ్ళు ఎవ్వరు తెచ్చి ఇస్తారు? చిన్న యాక్సిడెంటు పరంగా నా కాలి చిలమండ విరిగితేనే ఎంత కష్టంగా నాకు మాత్రమే కాక మా కుంటుంబంలోని అందరికీ ఎంత ఇబ్బందిగా ఉందో నాకు మాత్రమే తెలుసు. అలాంటిది ఇప్పుడు పూర్తిగా అపస్మారక స్థితిలో ఉన్న అమ్మాయి తన ప్రాణం కన్నా మిన్నగా దాచుకునే తన మానాన్ని దోచుకునే ప్రయత్నం చేసిన యువకునితో ఆత్మరక్షణార్దం జరిగిన ఘటనలో తన శరీరాన్ని ఇంతటి దుస్థితికి చేరుకుంది అన్న విషయం తెలుసుకుని ఎంత విలవిలాడిపోతుందో అర్దం చేసుకోగలను. ఈ అమ్మాయి తిరిగి సాధారణ స్థితికి చేరుకోవాలంటే ఎన్ని ఆపరేషన్స్ చెయ్యాలో? ఎంతటి ఖర్చు అవుతుందో? ఇంతకాలం తిండి తినకుండా ఈ అమ్మాయి ఏమి తిని బ్రతకాలి?

17, ఏప్రిల్ 2011, ఆదివారం

దైవం – విలువ ఎంత?

దైవంపై పలు ఆలోచనల తరువాత, లెక్కా పత్రాలు అడిగే వారికోసం ఈవిధంగా సమాధానం ఇస్తే ఎలా ఉంటుందా అనే ఆలోచనలలోంచి ఉద్బవించినదే ఈ పుట. దైవం గురించి ఆలోచనలకు రూపం ఇచ్చే ప్రయత్నంలో కొన్ని నిజాలను ప్రతిపాదించిన మహాను భావుల ఆలోచనలను మనం ఎలా ఊహించుకుని అర్దం చేసుకోవాలో చెప్పే ప్రయత్నంలోంచి అనుకోకుండా మరో ఆలోచన ఉద్బవించింది. ముందుగా క్రిందటి పుటలోంచి ఉద్బవించిన ఆలోచన.

నిజానికి ఎలక్ట్రాన్ అనేది ఉందని ఎవ్వరు చూసారు? భూమి గుండ్రంగానే కాక ఎలిప్టికల్ ఆకారంలో ఉందని ఎవ్వరు చూసారు?  గురుర్వాకర్షణ శక్తి గురించి చేసిన ప్రతిపాదనను మనం ఎలా నమ్మాలి? ఇంకా వగైరా వగైరా.. ఇవన్నీ చార్వాకుల ఆలోచనలు. ఇంతకీ ఈ చార్వాకులెవ్వరు? వారి సిద్దాంతం ఏమిటి? అని ఆలోచిస్తే .. ముందుగా చార్వాక సిద్దాంతం బయట పడుతుంది. ఆ తరువాత వీరి నేచర్ అర్దం అవుతుంది.

ఏదైనా విషయాన్ని తమ కళ్ళద్వారా చూచి నమ్మేవారిని చార్వాకులు అని అంటాము. ఉదాహరణకి భారతీయ సంసృతి ప్రకారం ఏదైనా తప్పు జరిగినప్పుడు, ఆ తప్పుని చేస్తున్న వారు ఆ తప్పుని చేస్తున్నప్పుడు చూసిన సాక్షులు కావాలి. అలా సాక్షం ఉన్నప్పుడే నిజ్జంగా ఆ తప్పు జరిగినట్లు మన రాజ్యాంగం తీర్పునిస్తుంది. ఈ విధంగా చార్వాకులు అనే వారు ఎవ్వరంటే, చక్రవర్తి అనేవాడు ఈ పోస్ట్ వ్రాసాడు అని అంటే, చక్రవర్తి వ్రాస్తున్నప్పుడు నేను చూడలేదు కాబట్టి నేను నమ్మను అనేవారి. ఒకవేళ చక్రవర్తి నిజ్జంగా ఈ పోస్టు వ్రాస్తున్నప్పుడు వీరు చూచి ఉంటే, అప్పుడు వీరు నమ్ముతారు అన్నమాట.

ఇలాంటి చార్వాకులే కొన్ని సార్లు మనకి మేలు చేస్తుంటారు, కానీ చాలా సార్లు (అంటే దాదాపుగా అన్ని సార్లు) మనకు నష్టాన్నే కలిగిస్తారు. ఉదాహరణకి నన్నయ్య గారిని మన ప్రభుత్వం ఆది కవి అని గౌరవిస్తే, అసలు నన్నయ్య అనే వాడు లేడు అందువల్ల ఇలాంటి ఆలోచన వ్యర్దం అని వాదించే వారు. అదిగో అలాంటి ఆలోచనే ఖచ్చితంగా “దేవుడు లేడనే” వాదన. “దేవుడనే వాడు నిజ్జంగా ఉంటే కనబడమనిండి చూద్దాం!!” అని వితండంగా వాదించేవారు. క్రిందటి పుటలో Physics / Geology / Education / వంటి వాటి గురించి సున్నితంగా సృజించాను. ఇప్పుడు Mathematics పరంగా లెక్కలేసే ప్రయత్నం చేస్తాను.

మనం ఎప్పుడైనా లెక్కలలో ఏదైనా తెలియనప్పుడు దానిని X (ఎక్స్) అనుకుంటాం. అలాగే ఈ దైవాన్ని ప్రస్తుతానికి X అనుకుందాం. అలాగే ప్రతీ మనిషికీ ఓ విలువ ఉంటుంది. ఈ విలువ వారు చేసే పనిని బట్టి ఉంటుంది. ఉదాహరణకి ఏదైనా ఉద్యోగానికి వెళ్ళాం అనుకోండి మనచేత ఉద్యోగం చేయించుకునే వ్యవస్థ మన విలువను లెక్కగట్టి నెలకు ఇంత ఇస్తాం అని నిర్ణయిస్తారు. ఆ విలువను Y అనుకుందాం. ఇప్పుడు నాకు అక్కడ చేసే పనిలో దైవం తోడైయాడనుకుందాం అప్పుడు నా విలువ ఏమిటంటే

నా విలువ =  X (దైవం విలువ) + Y (నాకు ప్రపంచం కట్టిన విలువ)

ఆ విధంగా నావిలువ Z అనుకుందాం. Mathematics సూత్రాల ప్రకారం  Z = X + Y

ఇప్పుడు దైవం లేదనుకుందాం. దైవమే లేదనుకుంటే, దైవానికి విలువకూడా లేనట్టే కదా, అందువలన Z = Zero + Y, కాబట్టి

Z = Y

కానీ ఒక్క సారి ఇలా ఆలోచించండి. దైవం ఉండటం వల్ల దైవానికి ఓ విలువ ఉంటుంది కదా, అందువల్లన Z = SomeValue + Y, కాబట్టి

Z ≠ Y

నేను పాజిటివ్‍గా ఆలోచించే వాడిని కాబట్టి ఇంతకు ముందు చెప్పిన ప్రతిపాదనలోని SomeValue అనేది తప్పనిసరిగా అది సున్నాకన్నా ఎక్కువే ఉంటుంది అని అనుకుంటాను. ఆ విధంగా SomeValue అనేది అధమ పక్షంలో 1 అయినా

Z = 1 + Y

నేను నెగెటివ్‍గా ఆలోచించే వారి గురించి ఇక్కడ ప్రస్తావించను. ఇప్పుడు అన్ని లెక్కలు అయినాయి కాబట్టి, ఒక సూటి ప్రశ్న. నిజ్జంగా దేవుడు లేడనుకుంటే, నాకు పోయిన నష్టం ఏమీ లేదు. అదే కనుక దేవుడు లేడనుకున్న తరువాత దైవం ఉంది అని తెలిసందుకోండి అప్పుడు ఆ దైవం విలువ నాకు కలవక పోవడం వలన నాకు ఉండవలసిన విలువ తగ్గిపోయినట్లే కదా?

14, ఏప్రిల్ 2011, గురువారం

పుణ్యభూమిపై జరుగుతున్న దాడి – మహానుభావుల భావన

కొంతకాలం క్రిందట పుణ్యభూమి అనే గుంపునందు ఓ చర్చ జరిగింది. ఆ చర్చలో ఇద్దరు వ్యక్తులు నా భావాలకు వ్యతిరేకంగా స్పందించారు. వారిలో మొదటి వారు ఓ పేరు మోసిన తెలుగు బ్లాగర్ గారైతే, పరదేశి గారు మరొకరు. వీరి భావనలలోని ఆంతర్యం మరో మహానుభావునితో పోలి ఉందని ఈ మధ్య నాకు అర్దం అయ్యింది. వీరందరి ఆలోచనలలో చాలాచక్కటి పోలికే కాక భారతీయత యందు వీరందరికీ చాలా దగ్గరి సంబంధం కనబడుతోంది. ఇంతకీ ఆ మూడో వ్యక్తి ఎవ్వరంటే, గౌరవనీయులైన గరిక పాటి నరశింహా రావు గారు.
ప్రతీరోజు భక్తి టీవిలో గరికపాటి వారు రామాయణం గురించి ప్రసంగం చేస్తున్నారు. మధ్య మధ్యలో వీరు పిట్టకధలుగా రామాయణం నుంచి తొలగి మన సంసృతికి పడుతున్న దుర్ఘతి గురించి వీరు పడుతున్న ఆవేదన పడుతూ చేసే వ్యాఖ్యానాలు పైన ఉదహరించిన వారి భావనలతో నూటికి నూరు శాతం సరిపోతుంది.  ఒక్కొసారి ఈ చర్చలో జరిగిన విషయాన్ని చదువుతుంటే, గరికపాటి వారి వ్యాఖ్యానం వింటుంటే చాలా ముచ్చటేస్తుంది.
నిజంగానే ఇది ఓ సరి అయిన సమయం, ముష్కరులపై మనం కూడా దాడి చెయ్యాలి. ఈ విషయం తెలియడానికి నాకు చాలా సమయం పట్టింది, కానీ వీరిని నేను అపార్దం చేసుకోలేదని బ్లాగు పూర్వకంగా వినతి. ఇక దాడి విషయానికి వస్తే, వివాదాలకి దూరంగా ఉంటూ వచ్చిన నాకు వివాదస్పదమైన చర్చ జరుగుతున్నప్పుడు వెళ్ళి అనవసర దాడిని తిరిగి త్రిప్పి కొట్టే ప్రయత్నం చెయ్యడానికి కొంచం ధైర్యం కావాలి. మన సంసృతిపై సరి అయిన అవగాహన వస్తే ధైర్యం దానంతట అదే వచ్చేస్తుంది. అలాగే చొరవ వస్తుందని నమ్ముతూ సంసృతిని అర్దం చేసుకునే ప్రయత్నం చేస్తాను.
అన్యమనస్కంగా ఆ ఇద్దరి పేర్లను ఇంతకు ముందు ప్రస్తావించినందులకు వారి అభిమతం దెబ్బదిన్నట్లైతే, మన్నించ ప్రార్ధన.
 
Clicky Web Analytics